మా వియ్యంకులు
మా తనయలు
చి.ల.సౌ ప్రణతి, ప్రత్యూషలు
మా అల్లుళ్ళు
చి. రవి చంద్ర, చి. రామకృష్ణలు,
మా వియ్యంకులు
శ్రీమతి కొమర్రాజు శారద గారు,
మహారాజశ్రీ వీరభద్రరావుగారలు,
శ్రీమతి రావెల ఛాయ,
మహారాజశ్రీ హరనాథ బాబు గారలు
పెద్ద కూతురు ప్రణతికి పెరిగె ప్రతిభ
భర్త చందును కలిసిన బహుళ ప్రభన
చిన్న కూతురు ప్రత్యూష సేమ మరయు
రామకృష్ణుడు రావెల రత్న మనగ
వియ్యమందినాము విప్రుల మంత్రాల
కొమర రాజు వారి కొసరు కోరి
మా తనూజ వారి మనసిజ ప్రణతిని
కోడలనరు తమకు కూతు రంద్రు
పడతి ఛాయల హరనాధు బాబుగార్ల
బంధమమరె మాకు బంధులయిరి
హరిని నమ్మినట్టి హరనాథ బాబుకు
సాయు భక్తి ప్రియము సాయి వరము
అసలు చందు, రాము అల్లుళ్ళు అనరాదు
స్వంత కొడుకులైరి సాయ పడుచు
చేర బిలిచి సేవ చేసేటి అల్లుళ్ళు
మమ్ము కొలువ తమకు మక్కు వంద్రు
కుదురు గల్గిన చంద్రుని గూడు చేరి
ప్రణతి ఆనంద భాగ్యాల పరవశించె
రాము కేలంది ప్రత్యూష రమణి యాయె
జంట లెరిగిరి సంసార జలథి ఈత
ఎన్ని జన్మల బంధమో ఎరుగ లేము
ఎన్ని పూజల ఫలమిదో ఎరికెలేదు
కొమర రాజుల, రావెల కొత్త లేని
ఆదరమ్మున మురిశాము అంతు లేక.
మా బావగారు మాన్య శ్రీ కొమర్రాజు వీరభద్ర రావుగారి
75వ వసంతోత్సవ వేళ – నా పద్య హేల
మాకు లభ్యమైరి మాన్యులు భద్రులు
మాకు బందుగులయి మహిమ మీర
కొమర రాజువారు కొంగున బంగారు
కామితార్థ సిధ్ధి కలిగె మాకు
వారి పుత్ర రత్నవాంశుడు చంద్రుడు
అల్లుడయ్యె పెద్ద అల్లుడయ్యె
ప్రణతినిచ్చి వార్కి ప్రణతుల నిడినాము
వియ్య మందినాము నెయ్యమయ్యె
చందు పితవరులకు శతమాన మనగాను
ప్రణతి మామగార్ని ప్రేమగాను
డోలికమ్మ వార్ని దోసిలొగ్గి పిలిచె
ప్లాటినంపు జూబ్లి ప్రాభవాన
ఆర్య వీరభద్రు లభయ మిచ్చిన వేళ
అమ్మ శారదాంబ ఆన తిచ్చె
చందు, ప్రణతి, డోలి, బంధువులు కలిసి
విందు చేసినారు పొందు మీర
అస్తు శ్రీరస్తు శుభమస్తు అస్తు రస్తు
సిరులు, ఈప్సితమెల్లయు సిధ్ధి రస్తు
కుసుమ వర్షంబు గగనాన కురియ నేడు
మెచ్చి దేవుళ్ళు ఆశీస్సు లిచ్చు మీకు.
శ్రీ ఎల్లాప్రగడ రామకృష్ణగారు
రామ కృష్ణగారు రమణీయ కవనాల
ధారవాహి వారు ధన్య కవులు
పద్య, గద్య, కవిత, పాటల అథినేత
నాకు గురువు తాను నా విథాత
ఒడుపు సొగసులు తెలిసిన యొజ్జబంతి
తేట తెలుగుల బిగువుల మేటి వక్త
భావ పరిపుష్టి కలిగిన భావుకుండు,
నవ్య కవనాల రీతుల నధిపు డతడు
కవన మర్మము గమనము గమ్య మెరిగి
కావ్య వైశిష్ఠ ధర్మము, గరిమ నెరిగి
గీతి జాతుల కావ్యాల రీతు లెరుగు
శతక వాజ్ఞయ భూషిత చతురు మతియు
పద్య రచన యన్న పరవశింతురు వారు
వ్రాసినారు మిగుల వాసిగాను
ఛంద భద్ధమైన శతకాలు కూర్చిరి
వాటి సంఖ్య దాటె పదులు మీర
విద్య కలిసి నేర్చి విద్యార్థి దశలోన
కవన విథము దెలిపి కరుణ జూపి
ఆది గురువు తాను ఆచార్యు లైనారు
వ్రాయ నేర్పినారు గేయకవిత
కలిత కవనాల కూర్పుల కలియ ద్రిప్పి
అలరు బాణీల భాష్యాల సులువు జూపి
నేను వ్రాసిన చిత్తుల నిపుణ గతిన
కూర్చి నారయ్య కవితగ మార్చి నారు
నన్ను కవి చేసినారయ్య నాకు దిక్కై
నన్ను అభ్యుద యాన వార్నడిపినారు
నేడు నేనున్న స్థాయిని నిలివ జేసి
కరుణ ఆశీస్సు లిడినారు కఱవు దీర
శతక బాట పట్టి శాశ్వత కీర్తిని
బడిసి నట్టి మీరు బహుధ విదులు
సుకవి మీదు కవిత సూక్తి ముక్తావళీ
రామకృష్ణ సూక్తి రసిక భుక్తి
రావిప్రోలు హితులు రమ్య మతులు
రావిప్రోలు వారు రారాజ నందురు
దాతృశీలి వారు ధర్మ హితులు
అట్టి వారి ఇంట ఆశ్రయం దొరికెను
నేర్చుకొంటి మేలు నియమ నీతి
శివుడు నాగు రాము సోము చందును రాజు
అరయ తల్లి వారి ఆడపడుచు
కలిసి ఏర్వురైన కలిమిన నన్గూడ
కలుపు కొనిరి తమకు చెలిమి వలన
శివుడు ఆర్కియాలజిలోన శిష్టుడయ్యె
నాగు డాక్టరు రసయన నాడి తెలిసె
రాము రాజులు వార్వారి రంగ విభులు
సోము చందులు మేధల శోధలైరి
రాముడు నామ ధేయమున రంజిలు మైత్రియె రాగరమ్య మౌ
దామము, అందు నాకు నిటు దారపు మాత్రపు చోటు నిచ్చె, తా
సోముడు సర్వదా సఖుడు శోక వినాశక రుండు నాకు, ఆ
రాముని సన్ను తింతును విరాజిత వృధ్ధిని వాన్కి గూర్పగాన్
భార్య యైన దమ్మ భాగ్యాన ఉమరాణి
రాము ప్రణయ సీమ రాసక్రీడ
గావి ప్రోలు వారి రాజ్యాన గోవాడ
బావుటాలు వెలిగె బాగుగాను
బాల్య మిత్రులనగ బహుముఖ ప్రాజ్ఞులు
వీరు నాకు సఖులు విప్ర వరులు
చిన్న నాటి నుండి నన్ను వీడని వారు
నాణ్య మతులు ఎన్న నాకు హితులు
శ్రీ గాడిచర్ల బదరీనాధ్ గారు (10-12-1010)
ఏమి కబురులు మధుబాబు ఏమిటయ్య,
కొత్త పాటలు ఏవైన కొన్ని ఇవ్వు
పిల్లలందరి కొఱక”ని పిలిచి అడుగు
బదిరినాథులు బహుదొడ్డ బాంధవుండు
స్వఛ్ఛమైన మనసు, స్వాభిమానులు వారు
ఇచ్చగించరెపుడు ఇచ్చకాలు
సాధు భావులైన సన్మార్గ వర్తులు
హితులు చెప్పు శిష్ఠమతులు వారు
అనుభవాలు ఎన్నొ, అభిమానులెందరో
శిష్యులెందరోను శీఘ్రమనగ
క్రమము తప్పబోని క్రమశిక్షణెంతయో
అడుగ వలదు మాకు అవగతమ్ము
హాస్య చతురులు, సంభాషి, హాస్య ప్రియులు
బాల ఆనంద సంఘాల భాష్య విదులు
బంటి, అల్కల గన్నట్టి భాగ్య శాలి
జీవితాంతమ్ము కళలకు జీవ మయ్యె
అయ్య బదరీనాథు లాత్మీయు లైనారు
పోరి, అడిగి నన్ను ప్రోత్సహించి
పాటలెన్నొ వ్రాసి పాడించి బంటితో
కీర్తి నిచ్చి శేష కీర్తు లైరి
బదిరి నాథులు అసువులు బాసి”రనుచు
విన్న వెంటనె నైరాశ్య వీధిలోన
మనసు సర్వము కోల్పోయి మాటరాక
నిలిచి, నిశ్చేష్ఠ అయిపోయి నింగి జూచె
శ్రీ విన్నకోట మురశీకృష్ణగారు
విన్నకోట మురళి విద్వాంసులన్నారు
విన్న నేను తరచి విపుల మెరిగి
పరిచయాన్ని కోరి దరిశన మడిగాను
తొలుత పలకరింపు దొరుక లేదు
రెండు మూడు మార్లు రెట్టింపు దీక్షతో
వెడలినాను ఎంతొ వేడ్కమీర
ఎపుడు వెళ్ళినాను ఏవో అరిష్టాలు
గొప్ప కవుల గోష్టి కొన్ని సార్లు
సాహసాన్ని చేసి సాధించి తీరాలి
అన్న పట్టుదలతొ ఆశ తోడ
ఒక్క నాటి ఉదయ మొడిసి పట్టితినేను
చేతులెత్తి మ్రొక్కి చెప్పినాను
గుర్తు పట్టినారు గురువులు పూజ్యులు
ఆదరించి నారు అభయమిచ్చి
చేరగాను బిల్చి చేతిలో దాచిన
పాట బాణి కట్టి పాడునారు.
అట్టి పరిచయ భాగ్యమ్ము అనుభవించి
నేటి కైనది మాదైన మేటి చెలిమి
అన్ని రాగములను అలవోకగా తాను
తలచి నంత బాణి తరలివచ్చు
అందరానట్టి శిఖరాల నందినాను
మేలు సాహిత్య సీమలో మెసలినాను
నాదు కవితకు చక్కని నగిషి నిచ్చి
వెన్ను తట్టిన గురువు శ్రీ విన్నకోట

Dr. బంటి
బంటి స్నేహమ్ము నాపాలి భాగ్యమయ్యె
బంటి శృతిలయలోకాల బంధువయ్యె
బంటి నవనీతరాగాల బహుమతయ్యె
బంటి అనుభూతి సీమల భానుడయ్యె
ఓడి పోని అమ్మ పోరాట పటిమది
గాడి చర్ల సత్య నాడి తనది
ఆడి తప్పని తనము ఆశ్రిత వారధి
సేమ మరసి సేవ చేయు పరిధి
ఎన్న మేలైన స్వరకర్త లెందరున్న
అందరూజేరి కోరేరు ఆదరాన
బంటి మారాజు గొంతులో భావ గీతి
ఋతుల రాగాల పాచిన కృతిగ మారె
వంది మాగధు లెవ్వరు మాకు లేరు
సింధువున గలసిన మేము బిందువులము
అమర సంగీత సాహిత్య భ్రమర మనగ
ఋతుల రాగలు బ్రతుకున శృతిగ మారె
ఎన్ని జన్మల బంధమో ఎన్నలేను
ఎంత సంస్కార వంతుడో ఎంచ లేను
నాకు దొరికిన మిత్రుడు నాణ్య సఖుడు
నన్ను మెచ్చిన మనసున్న నరుడు బంటి
క్షేమ మరసెడు వైద్యుడు, స్నేహ జీవి
స్వార్థ మెరుగని వాడైన సాధు ఘనుడు,
బంటి బ్లూక్రాసు సేవల బాటలోనె
పయన మయ్యిన బహువిధ బాటసారి.

సునీత
మనసులోకి జారి మధురిమ ఒంపేసి
చిలిపి నవ్వు రువ్వి చివురు లాగ
సరళ తరళ గాత్ర సంగీత వాహిని
నిజము సిసలు మన సునీత పాట
అమర సంగీత సుథలవి అమరు తోట
తెలిసి సుస్వర మెరిగిన తేటి నోట
తెలుగు గుండెకు పరిచిత జిలుగు తేట
నిత్య సాహిత్య బంధు సునీత పాట
చిక్కనైనట్టి సరిగమ చిక్కు వీడె
మధుర గీతాలు ఆమెకు మాలి మయ్యె
ఇంత సుస్వర సంపన్న మేమిటన్న
నిరుప లావణ్య గీతి సునీత పాట
శ్రీ వేటూరి గారికి అశృనివాళి…..
మాటకు విల్వనిచ్చి, సుమమాలిక లాగున పాట కూర్చి, ఆ
పాటకు ప్రాణ మిచ్చి, పసిపాపల లాలిగ మార్చి, పేర్చు, నీ
ధాటికి భావగీతముల తావులు నిండె సినీ జగత్తులో
పోటుగ పాట లొంపితివి పొందుగ కావ్య వనాంతరంబునన్
దక్కె నెన్నియో నందులు ధారగాను
ఎన్నొ సత్కార యోగాలొ ఎన్నలేము
భాష నీదయ్య తెలుగుల భాగ్యమీవె
సాగుచేసిన సాపత్య సరళి నీదె
ఇంత సొగసుగాను ఇన్ని పాటలు వ్రాసి
వాస్తవాన బహుళ వాసిగాను
ఆంధ్రజాతి ఘనత అంబరం చాటెగా
గగన తారవైన గడియలోన
గీత రచయిత నన్నట్టి గీర లేదు
సభ్య సామాన్య జనులకు సఖులు మీరు
సాధు సజ్జన సాహితీ స్వాభిమాన
తెనుగు నాటను మీకీర్తి వెలుగు లీనె
కొందరు గీతకారులన, కొందరు పండితశ్రేష్ఠు, లెందరో
కొందరు కావ్య కర్తలుగ, కొందరు పద్య ప్రకాండ కీర్తులున్
అందరు మెచ్చు సాహితిని అచ్చ తెనుంగున వ్రాసినాడహో
సుందర రామ మూర్తి యిల సుందర గీతుల వేనవేలుగా
అచ్చమైనట్టి కవిరాజు అస్తమించె
బిక్క చచ్చెను శోకాన దిక్కులన్ని
గొప్ప గీతాలు భువనాన గొంతువిప్పె
జిలుగు తారక గగనాన వెలిగి పోయె.